శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంగ్రహ జీవిత చరిత్ర

శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములవారు ప్రకృతాంబ, పరిపూర్ణాచార్యులను విశ్వబ్రాహ్మణ దంపతులకు సర్స్వతి నది తీరములో జన్మించారు. ఆత్రి ముని ఆశ్రమములో శిశువుగా పెరిగారు. కర్నాటక రాష్ట్రములోని పాపాఘ్ని మఠాధిపతులు  శ్రీ యనమదల వీరభోజయ, వీరపాపమాంబా దంపతులకు దత్తపుత్రుడిగా గడిపారు.

కాంచీపురములో ఆనందభైరవ యోగికి వీరనారాయణ మహామంత్రముపదేశించారు. బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ వెంకటరెడ్డి దంపతులయింట గోపాలనం చేశారు. రవ్వలకొండలో సాంద్రసింధు వేదమైన కాలజ్ఞానం రచించారు. యాగంటి గుహల్లో తపస్సు చేశారు. అచ్చమ్మ దంపతులకు బ్రహ్మోపదేశం చేశారు. ఆ దంపతులు నిర్మించిన నెల మఠము లో అన్నాజయ్యకు కాలజ్ఞానం భోదించారు. తాను శిల్పీకరించిన వీరభద్రస్వామి శిలావిగ్రహాన్ని అల్లాడుపల్లెలో ప్రతిష్టించారు.

కందిమల్లయ్యపల్లెలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని పెద్దకొమెర్ల శివకోటయ్యాచార్య పుత్రిక గోవిందమాంబాను వివాహం చేసుకొన్నారు. అయిదుగురు పుత్రులు, ఒక పుత్రిక సంతానం. శిష్యగణ సమేతంగా దేశం నాలుచెరగులా సంచరించి వేదాంత తత్వ ప్రచారం గావించారు.

మహమ్మదీయ తెగకు చెందిన సిద్దయ్యను శిష్యునిగా చేసుకున్నారు. సిద్దవటం, కడప, కర్నూల్, బనగానపల్లే నవాబుల మన్ననలు పొందారు. పుష్పగిరి లో బ్రహ్మరథ సత్కారం పొందారు. శరీరములో దేవతలను చూడాలని భార్యను చంపిన హరిజన కక్కయ్యకు జ్ఞానోపదేశం చేసి, అతని భార్య ముత్తెమ్మకు జీవం పోశారు. సిద్దవటం నవాబుచే గ్రహించిన సుమారు ఏడేకరాల స్థలములో మఠము నిర్మించుకున్నారు.

తన తరువాత పుత్రిక వీరనారాయణమ్మ వారి వంశమే ఈ మాఠాధిపత్యం వహిస్తుందని ఆశీర్వదించారు. కలియుగములో పాపభారం ఎక్కువైనప్పుడు తాను వీరభోగ వసంతరాయుడుగా జన్మించి ధర్మసంస్థాపన చేస్తానని తెలిపారు.

క్రీ !! శ !! 1608 జన్మించిన శ్రీ స్వాములవారు పూర్ణాయుష్యం బాహ్య ప్రపంచములో గడిపి క్రీ !! శ !! 1693 లో శ్రీముఖనామ సంవత్సర వైశాఖ శుద్ద దశమి నాడు సజీవ సమాధిలోకి ప్రవేశించారు. నాటి నుండి జగత్కళ్యాణం కోసం యోగనిద్రా ముద్రితులై భక్తాదుల నీరాజనాలు స్వీకరిస్తున్నారు.

{ పైన సమాచారం తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ దర్శిని నుండి తీసుకోవడమైనది }

WhatsApp
Call Us